ఎయిర్ బస్ నుంచి ‘ఫ్యూచరిస్టిక్’ విమానం

ఎయిర్ బస్ నుంచి ‘ఫ్యూచరిస్టిక్’ విమానం

20 శాతం ఇంథనం ఆదా...డిజైన్లలో వినూత్న మార్పులు

ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ విప్లవాత్మక డిజైన్ తో కొత్త విమానాన్ని వాణిజ్య అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫ్యూచరిస్టిక్ బ్లెండెడ్ వింగ్ వాణిజ్య విమానం ద్వారా ప్రస్తుత విమానాల్లో ఉపయోగించే ఇంథనం కంటే 20 శాతం తక్కువ ఇంథనంతో విమానాలను నడపొచ్చు. అంతే కాదు..ఈ డిజైన్ ప్రస్తుత విమానాల కంటే మరింత వినూత్న మార్పులతో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. బ్లెండెడ్ వింగ్స్ అంటే విమాన ప్రధాన బాడీకి...రెక్కలకు మధ్య తేడా పెద్దగా కన్పించదు. రెక్కలు కూడా బాడీలో భాగంగానే ఉన్నట్లు కన్పిస్తాయి. ప్రస్తుత విమానాలకు రెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి. కానీ ఈ బ్లెండెడ్ వింగ్ బాడీ (బిడబ్ల్యుబి)లో విమానబాడీ, రెక్కలు అంతా ఒకే భాగంగానే కన్పిస్తాయి. ఫ్రెంచ్ కు చెందిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ సింగపూర్ లో జరుగుతున్న 2020 ఎయిర్ షోలో రిమోట్ తో నడిచే చిన్న పాటి ఈ బ్లెండెడ్ వింగ్ వాణిజ్య విమానాన్ని ప్రదర్శించింది.

ఇలా ప్రదర్శించిన విమానం పేరును మావెరెక్ (MAVERIC)గా పిలుస్తారు. ఈ విమానాలను 2019 జూన్ నుంచి పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2017లో ప్రారంభించారు. ఇటీవల వరకూ ఈ విషయాన్ని ఎయిర్ బస్ చాలా రహస్యంగానే ఉంచింది. ఈ కొత్త మోడల్ ఇంథనాన్ని 20 శాతం ఆదా చేయటమే కాకుండా కేబిన్ డిజైన్ లో కూడా ఎన్నో మార్పులకు వీలు కల్పిస్తుందని తెలిపారు. అంతే కాదు..ప్రయాణ సమయంలో విమాన శబ్దం కూడా గణనీయంగా తగ్గనుంది. అయితే ఇప్పటికిప్పుడే విమాన ప్రయాణికులు ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే 2020 మధ్య వరకూ దీనికి సంబంధించిన ప్రయోగాలు కొనసాగుతాయని చెబుతున్నారు. అయితే ఈ విమానాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే అంశంపై మాత్రం ఎయిర్ బస్ ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు. ఫ్లైట్ కంట్రోల్ టెక్నాలజీలో మార్పులు, విమాన బరువు తగ్గింపు వంటి అంశాలతో డిజైన్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ బస్ ఈ కొత్త మోడల్ విమాన ట్రయల్ రన్స్ ను రహస్య ప్రదేశాల్లో నిర్వహించిందని సమాచారం.

https://www.youtube.com/watch?v=xG3Q6yLiJbg

Similar Posts

Recent Posts

International

Share it