అలంపూర్

అలంపూర్

ఇది కృష్ణా, తుంగభద్ర నదులు సంగమించే ప్రాంతం. అందుకే దీన్ని దక్షిణ కాశీగా కూడా అభివర్ణిస్తారు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపురం చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపురం ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు,కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది.అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య -4 కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మఅనే ఆ తొమ్మిది దేవాలయాలు అన్నీ కూడా తుంగభద్ర నది ఒడ్డున ఉన్నాయి. వీటిలో బాల బ్రహ్మేశ్వరాలయం పెద్దది,ఇక్కడి శాసనాల ఆధారంగా దీనిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా గుర్తించారు. ఇక్కడ శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

అలంపూర్ లో ప్రధానమైంది జోగులాంబ ఆలయం. ఇది అలంపురంలో ఆగ్నేయదిశగా ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు.జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత,సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. ఈ శక్తిపీఠాన్ని సందర్శించడానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.ఉమ్మడి మహబూబ్ నగర్ లోని ఈ దేవాలయం ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. తెలంగాణలో ఉన్న దేవాలయాల్లో అలంపూర్ దేవాలయ్యాన్ని అతి పవిత్రమైన దేవాలయంగా చెబుతారు.

సందర్శన సమయం: ఉదయం 4.00 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ

అలంపూర్ హైదరాబాద్‌కు 213 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.మహబూబ్ నగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it