అమరావతి

అమరావతి

గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్న ఒక పుణ్యక్షేత్రమే ఈ అమరావతి. ఈ పట్టణం వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. ప్రాచీన శాసనాల ప్రకారం ఈ పట్టణానికి ధాన్యకటకం అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని పంచరామాలలో ఒకటైన అమరేశ్వరాలయం పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. ఈ పట్టణం జైన, బౌద్ధ మతా లకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రఖ్యాతుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలంగా క్రీ.శ. ఒకటవ శతాబ్దంలో ధ్యానకటకం ప్రసిద్ధి చెందింది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణంలో నివసించి అక్కడి వైభవం గురించి ప్రశంసించాడు. అమరావతిలో గల అమరేశ్వర ఆలయం కారణంగా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. ఇక్కడ నిర్మించిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా వినుతికెక్కింది. ఈ బౌద్ధ స్థూపాలను మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు.

ఆంధ్ర పాలకులలో మొదటి వాడైన శాతావాహనులకు సుమారు సామాన్యశక పూర్వం 3 వ శతాబ్దం నుండి సామాన్యశక పూర్వం 2 వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది.గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతిలోనే బోధించాడు.అందువల్ల అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రయాన గ్రంథంలో పొందుపరిచి ఉన్నాయి. నేడు ఈ పట్టణం, అమరావతి స్థూపం,పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా వినుతికెక్కింది. గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ ఉండటం విశేషం. ప్రతి యేటా విజయదశమి రోజున, మహా శివరాత్రి పర్వదినాన ఇక్కడ స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పంచారామాలలో ఒకటైన అమరారామం(అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం.పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొన్నారు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి, అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది.

Similar Posts

Share it