అహోబిలం

Update: 2019-04-28 12:38 GMT

అహోబిలం హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగానేకాక కొండలు, నదులలో కలగలిసి పర్యాటక ప్రాంతంగాకూడా అలరారుతోంది. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబిలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనదిగా పేరు వచ్చిందంటారు. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిశాడని.. అందువల్ల అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు. అందువల్ల నవ నారసింహక్షేత్రం అని కూడా అంటారు. నవ నారసింహులలో దిగువ అహోబిలం ప్రస్థావన లేదు. కాని ఈ ఆలయప్రాశస్త్యం అమోఘమైనది. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్‌కు 68 కిలోమీటర్ల దూరంలో ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ క్షేత్రం సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమైనది భవనాశిని నది. లక్ష్మీనరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాల కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో, దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి, అండాల్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నాయి.

 

 

Similar News

మంగళగిరి
హాయ్‌లాండ్