కనకదుర్గ దేవాలయం

Update: 2019-04-28 13:55 GMT

కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన దేవాలయమే కనకదుర్గ గుడి. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తర్వాత భక్తులు భారీగా తరలివచ్చే ఆలయాలలో ఇది ఒకటి.విజయవాడ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కనకదుర్గ గుడి, కృష్ణా బ్యారేజీలే. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది.ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు ఉంటుంది. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండాలని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలుచోవాలని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్దిని కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది.

ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి ఆయన నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో పేర్కొన్నారు. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది అమ్మవారి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించాలని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

 

Similar News

మంగళగిరి
హాయ్‌లాండ్