మృగవని జాతీయ వనం

Update: 2019-04-18 06:43 GMT

జీవవైవిధ్యానికి నిలయం ఈ జాతీయ వనం. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రాంతం ఇది. రక్షిత అడవిగా ఉన్న ఈ పార్కుకు 1998లో మృగవని జాతీయ వనంగా నామకరణం చేశారు. ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అటవీ శాఖ అభివృద్ధి సంస్థ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ పార్కులో ఐదు వందల చుక్కల జింకలు, 40 వరకు సాంబరు దుప్పిలు, 200పైగా నెమళ్లు, 100 జాతులకు పైగా పక్షులు,పదుల సంఖ్యలో జీవచరాలు ఉన్నాయి. కొన్ని చెట్లు, ఔషధ మొక్కలను గుర్తించేలా వాటి శాస్త్రీయ పేర్లతో బోర్డులు పెట్టారు. వారానికోసారి ప్రకృతి సంపదపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు పర్యావరణం, వన్యప్రాణుల గురించిన వివిధ అంశాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తారు.

దీనికోసం పార్కులో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని, 40మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఆడిటోరియాన్ని నిర్మించారు. ఇందులో విద్యార్థులకు వీడియో ప్రదర్శన ద్వారా రాష్ట్రంలోని పార్కులు,అభయారణ్యాలు, వన్యప్రాణులు, పర్యావరణ వైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా వివిధ రకాల జంతువుల నమూనాలతో మ్యూజియం, విద్యార్థులకు వన్యప్రాణులు, పర్యావరణంపై విజ్ఞానం పొందడానికి ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. మృగవని జాతీయ వనం హైదారాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో మొయినాబాద్‌‌ మండలం చిలుకూర్ గ్రామంలో 3.6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పార్కు సుమారు 850 ఎకరాల్లో విస్తరించి ఉంది.

సందర్శన వేళలు: ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ

 

 

Similar News

చార్మినార్