నిజాం మ్యూజియం

Update: 2019-04-18 09:10 GMT

చారిత్రక వారసత్వ సంపదకు కేంద్రం నిజాం మ్యూజియం. 1936వ సంవత్సరంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసఫ్ జాహీ 7వ నిజాం.. అఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌కు అందజేసిన బహుమతులను ప్రదర్శించే కేంద్రమే ఈ నిజాం మ్యూజియం. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు అందించిన స్మారక చిహ్నాలు, జ్ఞాపికలు, ఇతర వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ ని సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన ప్రదేశం ఈ నిజాం మ్యూజియం. నిజాముల ప్యాలస్‌లో ఒక భాగమైన ఈ మ్యుజియం అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇందులో ఎన్నో చిత్రలేఖనాలు, ఆభరణాలు, ఆయుధాలు అలాగే పురాతన శకానికి సంబంధించిన కార్లు వంటివి ఉన్నాయి.

వెండితో తయారు చేసిన హైదరాబాద్ నగరానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచారు. చెక్క, బంగారంతో చేసిన సింహాసనం, అత్తరు దాచుకునేందుకు అత్యద్భుతంగా చెక్కిన వెండి సీసాలు,వెండితో చెసిన కాఫీ కప్పులపై అలంకరించిన వజ్రాలు, చెక్కతో చెయ్యబడిన రైటింగ్ బాక్స్ ఇలాంటివి కొన్ని మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచిన అత్యద్భుతమైన వస్తువులు. వజ్రాలతో పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్,వెండితో తాయారు చేసిన ఏనుగు, మావటి వాడి శిల్పం వంటివి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే కళాఖండాలు.రోల్స్ రాయ్స్ అలాగే జాగ్వర్ మార్క్ వి కారులు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. ఈ కారులు పాతకాలపు కార్లని ఇష్టపడే వారిని అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ మ్యూజియం నగరంలోని పురానా హవేలీ ప్రాంతంలో ఉంటుంది.

సందర్శన: వేళలు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ

శుక్రవారం: సెలవు

Similar News

చార్మినార్