అన్నవరం

అన్నవరం

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వరాలు ఇచ్చేస్వామిగా ప్రసిద్ధి గాంచారు. భక్తుల కొంగుబంగారంగా అన్నవరం దేవస్థానం వెలుగొందుతోంది.అన్నవరంలోని సత్యనారాయణస్వామికి కుడిపక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామి వారిని రెండు అంతస్థుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్థులో మూలస్తంభం, పాదాలు దర్శించుకుని..నడుచుకుంటూ పైకి వెళితే శ్రీ సత్యనారాయణస్వామి మహేశ్వరుడు, అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై ఉంటారు. ఇలా ఒకే పీఠంపై శివ-కేశవులు అమ్మవారు కనిపించే అలయం దేశంలో మరోచోట ఎక్కడా లేదు. ఈ దేవాలయంలో ప్రతిరోజూ సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కొత్తగా పెళ్లైన దంపతులు అన్నవరం వచ్చి సత్యదేవ వ్రతం చేయటం ఆనవాయితీగా వస్తోంది. అన్నవరానికి సమీపంలో ఉన్న రత్నగిరి పర్వతంపై 1891వ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స దివాణం జమీందార్ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీ సత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ విషయం స్వయంగా రాజు గ్రామ పెద్దలకు వివరించారు. కలలో చెప్పినట్లుగానే అంకుడు చెట్టు దగ్గరే శ్రీ సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి.

తుని పట్టణానికి 15 కిలోమీటర్లలో ఈ దేవాలయం ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it