బొబ్బిలి కోట

బొబ్బిలి కోట

విజయనగరం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది బొబ్బిలి వంశం గురించే. బొబ్బిలికి తొలుత బెబ్బులి అని పిలిచేవారు. క్రమక్రమంగా ఇది బీరబొబ్బిలిగా మారింది. క్రీస్తుశకం 1757లో విజయనగరం -బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం జరిగింది. విజయనగరం రాజులు బుస్సీ దొరసాయంతో బొబ్బిలిరాజులపై దండయాత్ర చేశారు. ఈ యుద్ధంలో ఓటమి పాలవుతున్నట్లు గుర్తించి అంతపుర మహిళలను కూడా మంటల్లో నెట్టి..ఆ పోరాటంలో బొబ్బిలి రాజులు కూడా వీరమరణం పొందినట్లు చారిత్రక సమాచారం. తర్వాత ఈ ఓటమి సంగతి తెలుసుకున్న బొబ్బిలి రాజుల సన్నిహిత బంధువైన బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు రాజాం నుంచి ఆగమేఘాలపై వచ్చి బుస్సీ దొరపై యుద్ధం చేసినట్లు చెబుతారు. అదే కోటలో విజయరామరాజును కత్తితో పొడిచి హతమార్చారు.

ఈ బొబ్బిలి యద్ధానికి ఇక్కడి భైరవసాగరం వద్ద స్మారక చిహ్నం నిర్మించారు. 1891లో దీన్ని అప్పటి రాజా వి ఎస్ రంగారావు కట్టించారు. తర్వాత ఈ యుద్ధ స్తంభం చారిత్రక ప్రసిద్ధి సంతరించుకుంది. అదే సమయంలో బొబ్బిలి కోటను కూడా నిర్మించారు. వీటిని పర్యాటకులు సందర్శిస్తుంటారు. కోటలో రాజుల దర్బార్ నిర్వహణ కోసం ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దీన్ని దర్బార్ మహల్ గానే పిలుస్తారు. బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన కత్తులు, బల్లాలు, తుపాకులు, శరీర కవచాలు, పల్లకీ, రాజులు వాడిన సింహాసనాలు ఈ కోటలోనే భద్రపరిచారు. పర్యాటకులను ఇవి విశేషంగా ఆకట్టుకుంటాయి. చారిత్రక సాక్ష్యాలుగా వీటిని కోటలో భద్రపర్చారు.

Similar Posts

Share it