చార్మినార్

చార్మినార్

చార్మినార్ అంటే హైదరాబాద్..హైదరాబాద్ అంటే చార్మినార్ అనే అంతగా ఈ చారిత్రక కట్టడం గుర్తింపు దక్కించుకుంది. మహ్మద్ కులీ కుత్ బ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. తొలుత ఇక్కడ మూడు మినార్ లను మాత్రమే నిర్మించారు. నాలుగవది నిర్మించిన తర్వాతే దీనికి చార్మినార్ అనిపేరు వచ్చినట్లు చారిత్రక కథనం. చార్మినార్ ఎత్తు 53 మీటర్లు. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు.ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చ్ లు ఉన్నాయి. 3,4గ్యాలరీల్లో 12 ఆర్చ్ లు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు.అంతేకాక చార్మినార్‌ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి.

ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌ లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌ ఆర్చ్‌ ల బయటి వైపు కొలతలు28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మొదటి, రెండవ అంతస్తులలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌ లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి.

సందర్శన వేళలు: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it