చిలుకూరు

చిలుకూరు

చిలుకూరు ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని యువతీ, యువకులు నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని ‘వీసా బాలాజీ’ అని పిలుస్తారు. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సాదా సీదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు.ఆయనకు కలలో వేంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్లి, ఆ భక్తుడు అక్కడి పుట్టను తవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది.

అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగాలని వాణి వినిపించింది. అలా చేయగానే పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ఈ ఆలయంలో ‘హుండి’ ఉండదు. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండుసార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోర్కెలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అని చెబుతారు. దేవాలయం అర్చకులు "వాక్" అనే ధార్మిక మాస పత్రికను ప్రచురిస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it