చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా రాజమందిరం గత వైభవ చరిత్రకు నిదర్శనం. నగరం నడిబొడ్డులో ఈ ప్యాలెస్ నవీన-పురాతన శైలుల సమ్మిళిత కట్టడం. ఈ ప్యాలెస్‌లో నాలుగు వేర్వేరు రాజ ప్రాసాదాలు ఉంటాయి. మొఘల్ తరహా గుమ్మటాలతో, తోరణాలతో, ఆర్నేట్ స్టక్కో వంటి అనేక పర్షియన్ అంశాలతో ఈ ప్యాలెస్ సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఈ రాజ ప్రాసాదానికి పూర్వ వైభవాన్ని పున:సృష్టించటానికి 19 అందమైన బెల్జియం క్రిస్టల్ షాండ్లియర్స్ ను కొత్తగా ఏర్పాటు చేశారు. కుతుబ్‌షాహిల అనంతరం దక్కన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న అసఫ్‌జాహీల పాలనలో అద్భుతమైన కట్టడాలు జీవం పోసుకున్నాయి. వాటిలో ‘చౌమహల్లా ఖిల్వత్ ప్యాలెస్’ది ప్రత్యేకస్థానం. చార్మినార్‌కు సమీపంలో యూరోపియన్ శైలిలో నిర్మించిన నాలుగు ప్యాలెస్‌ల సముదాయమే చౌమహల్లా ప్యాలెస్. సుమారు 2.90 లక్షల గజాల విశాల ప్రాంగణంలో 5వ నిజాం అఫ్జలుద్దౌలా బహదూర్ పాలనలో (1857–69)వీటిని నిర్మించారని చర్రితకారుల అభిప్రాయం.

ఇరాన్ దేశం టెహ్రాన్‌లోని ‘షా ప్యాలెస్’ కంటే ఎన్నో రెట్లు మిన్నగా నిజాం ప్రభువు ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. 1912 ప్రాంతంలో ఏడవ నిజాం చౌమహల్లా ప్యాలెస్‌కు మరమ్మతులు చేయించి ప్యాలెస్‌ను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్యాలెస్ ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో పాలరాతి ఫౌంటెన్ కట్టిపడేస్తాయి. భవనంలోపల తలెత్తి చూస్తే సీలింగ్ ఆకాశాన్ని తాకుతుందా అన్న అనుభూతి కలుగుతుంది. లతలు, పూల అలంకరణతో 60 అడుగుల ఎత్తున గల ఆ సీలింగ్ నుంచి వేలాడే అతిపెద్ద బెల్జియం క్రిస్టల్ షాండ్లియర్ల అందాలు తప్పక చూడాల్సిందే. ఇవి నిజాంకు బహుమతిగా లభించాయని,మరికొన్ని 1799 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో నిజాంకు చెందాల్సిన వాటాగా టిప్సుల్తాన్ బహూకరించాడని చరిత్ర చెబుతోంది. ఆ రోజుల్లో విద్యుత్ సౌకర్యం లేకున్నా షాండ్లియర్లలో వెలుగు కోసం పొగరాని, మసి పట్టని కొవ్వొత్తులను లండన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.

సందర్శన: వేళలు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it