ప్రత్యేక విమానాల్లో గోవాకు పర్యాటకులు

ప్రత్యేక విమానాల్లో గోవాకు పర్యాటకులు

దేశంలోని సంపన్నులు ఎవరూ కూడా ప్రస్తుతం హాలిడేకు విదేశాలకు వెళ్లే ఛాన్స్ లేదు. దీంతో దేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రాంతం గోవా. అందుకే సంపన్నుల ఫ్యామిలీలు అన్నీ ఇప్పుడు గోవా బాట పట్టాయి. దేశంలో అత్యధిక బీచ్ లు ఉన్న గోవా పర్యాటకులకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే దేశంలోని బడాబాబులు అందరూ ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ గోవాకు క్యూకడుతున్నారు. ముఖ్యంగా కరోనా కేసులు పెద్ద ఎత్తున ఉన్న ముంబయ్, ఢిల్లీ, పూణేలకు చెందిన బడాబాబుల కుటుంబ సమేతంగా అందరూ గోవాలో వాలిపోతున్నారు. చాలా మందికి గోవాలో ప్రత్యేక వసతులతో కూడిన విలాసవంతమైన విల్లాలు కూడా ఉన్నాయి. సొంత విల్లాలు లేని వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గోవా ప్రభుత్వం కొత్తగా ఎంపికచేసిన హోటళ్ళను అనుమతించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా గోవా విమానాశ్రయానికి ప్రత్యేక విమానాలు క్యూ కడుతున్నాయి. దీని కోసం ఒక్కో ఫ్యామిలీ దాదాపు పది లక్షల రూపాయల వరకూ ఖర్చుపెడుతోంది.

అది కూడా ఒక్క ప్రత్యేక విమానాలకే సుమా. ఇలా ప్రత్యేక విమానాల్లో రావటం వల్ల విమానాశ్రయంలో రద్దీని తప్పించుకోవటంతోపాటు పలు సౌలభ్యాలు ఉంటాయని..అందుకే చాలా మంది డబ్బున్న వారు ఈ మోడల్ ను ఎంచుకున్నట్లు గోవా పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గోవాలోకి ప్రవేశించే వారు ఎవరైనా కరోనా నెగిటివ్ రిపోర్టును సమర్పిస్తే చాలు. లేదంటే అక్కడే పరీక్షలు నిర్వహించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ప్రతి రోజూ ఇప్పుడు గోవా విమానాశ్రయానికి ప్రత్యేక విమానాల ల్యాండింగ్ కు సంబంధించిన వినతులు వస్తున్నాయని..పరిస్థితులను బట్టి వీటికి అనుమతిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it