కర్ణాటకలో ‘క్యారవాన్ టూరిజం’ షురూ

కర్ణాటకలో ‘క్యారవాన్ టూరిజం’ షురూ

పర్యాటక పరంగా కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా హోటల్ లో ఉండాలన్నా టెన్షనే. ఇప్పుడు అలాంటి టెన్షన్లను పూర్తిగా తొలగించి..తాము ప్రయాణించిన వాహనంలోనే సేద తీరేలా పూర్తి సౌకర్యాలతో ఈ క్యారవాన్ పర్యాటక విధానాన్ని ప్రారంభించారు. కోవిడ్ 19 కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పర్యాటకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు వీలుగా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ క్యాంపర్ వ్యాన్ క్యాంప్స్ ఈ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టింది. క్యారవాన్ పర్యాటకాన్ని తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రారంభించారు. క్యారవాన్ పర్యాటక సర్వీసులతో రాష్ట్రంలో పర్యాటక రంగం పురోగమించగలదని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యారవాన్ లో ఉండే సీట్లను బెడ్స్ గా మార్చుకోవచ్చు.ఒక్కో క్యారవాన్ లో నలుగురు నిద్రించేందుకు అవకాశం ఉంటుంది.

ఇందులో షవర్ తోపాటు మోడ్రన్ టాయిలెట్, స్మార్ట్ టీవీ, మ్యూజిక్ సిస్టమ్ తోపాటు రిఫ్రిజిరేటర్, ఫ్రీజర్ తదితర సౌకర్యాలు కూడా ఉంటాయి. క్యారవాన్ బస్సుపైన 1400 వాట్స్ సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఈ బస్సులో సోలార్ ఎనర్జీనే ఉపయోగించుకోవచ్చు. తొలి దశలో కర్ణాటక పర్యాటక శాఖ క్యారవాన్ టూరిజాన్ని హంపి, గోకర్ణ, బాదామీ, కుద్రేముఖ్, సకలేష్ పురా, బెలూర్, శాక్రిబైలు, కొడగు(కూర్గ్) వంటి ప్రాంతాల్లో అనుమతించాలని నిర్ణయించారు. పర్యాటకులు అత్యంత సురక్షితంగా ఉండేందుకు, భౌతిక దూరం పాటించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని సీఎం యడ్యూరప్ప తెలిపారు. ప్రతి ఏటా కర్ణాటక జీఎస్ డీపీలో పర్యాటక రంగం 14 శాతం వాటా ఉండేది. ఇప్పుడు కరోనా దెబ్బకు ఇది దారుణంగా పడిపోయింది.

Similar Posts

Recent Posts

International

Share it