కోటిపల్లి

కోటిపల్లి

కోటిపల్లి, తూర్పు గోదావరి జిల్లా, పూర్వపు పామర్రు మండలానికి చెందిన గ్రామం. ఇది కాకినాడకు 38 కి.మీ.లు, రాజమండ్రికి 60 కి.మీ. దూరంలో ఉంది. కోటిపల్లి అమలాపురం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది,ఇక్కడకు పడవ లేదా ఫెర్రీ ద్వారా చేరుకోవచ్చు. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోటిపల్లి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామి వారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్ధన స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించారు.ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు,చంద్రుడు, కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని,రాజరాజేశ్వరీ సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు. శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్థన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి ఉత్తరపు ఒడ్డున ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మాహాత్మ్యం లో ఈ విధంగా పేర్కొన్నారు. ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తే వారి సర్వ పాపాలు పోతాయంటారు. అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు.

ఈ ఆలయ ప్రాంగణంలో ఉమాసమేత కోటీశ్వరాలయం, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం, భోగలింగ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయం ముందొక ధ్వజస్తంభం, నందీశ్వరుడు,కొలను ఉన్నాయి. ఈ రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయంలో దసరా ఉత్సవాలు, కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది.ఈ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.శివరాత్రి రోజు ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు.

Similar Posts

Recent Posts

International

Share it