జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం దూకుడు

జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం దూకుడు

30 లక్షలు దాటిన ప్రయాణికులు

హైదరాబాద్ లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం కరోనా సమయంలోనూ మెరుగైన పనితీరు కనపరుస్తోంది. ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు జీఎంఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానాశ్రయాల పున: ప్రారంభం అనంతరం విమాన ప్రయాణీకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు సురక్షితమన్న నమ్మకం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటూ, దేశీయ ప్రయాణికుల సంఖ్య నవంబర్ నెలలో 37,000 కు చేరింది. అన్‌లాక్ 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణీకుల వైద్య పరీక్షలు ఇతర వాటి ఆధారంగా క్వారంటైన్ నిబంధనలను సడలించడంతో భారత విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.

మే 25 నుండి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మొదటి కొన్ని వారాలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 3000 మంది ప్రయాణికులు ప్రయాణించారు. నాటి నుంచి నవంబర్ లో రోజూ 30,000 మంది ప్రయాణికులకు చేరింది. ఇది విమాన సర్వీసులు పున: ప్రారంభం నాటితో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. విమానాశ్రయం తిరిగి ప్రారంభమైన రోజు నుండి నవంబర్ 23 వరకు 30 లక్షల మందికి పైగా ప్రయాణీకుల రాకపోకలు జరిగాయి. విమాన సర్వీసులు పున:ప్రారంభమైన మొదటి కొన్ని వారాలలో హైదరాబాద్ నుంచి రోజూ 40 విమానాల రాకపోకలు జరగ్గా, నవంబరులో ప్రతిరోజూ 260 దేశీయ విమానాల రాకపోకలు జరిగాయి. విమాన సర్వీసులు పున: ప్రారంభమైన మొదటి రోజుకు ఇది ఆరురెట్లకన్నా ఎక్కువ.

విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి నవంబర్ 23 వరకు సుమారు 35,000కు పైగా దేశీయ విమానాల రాకపోకలు జరిగాయి. ఇటీవల దేశీయ ప్రయాణికుల సంఖ్య ఒక రోజులో 37,000 ను తాకింది, దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తరువాత ఇదే అత్యధికం. విమానాల రాకపోకల సంఖ్య ఒకే రోజు 284 ను దాటింది. కోవిడ్‌కు ముందు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 55 గమ్యస్థానాలు ఉండగా, నవంబర్ 23నాటికి 51 గమ్యస్థానాలకు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మరో మూడు కొత్త దేశీయ గమ్యస్థానాలు – కోజికోడ్, ఇంఫాల్, జగదల్‌పూర్లకు కూడా సర్వీసులు ప్రారంభమై, ఆర్ జీఐఏ నుంచి ఇప్పుడు మొత్తం 54 దేశీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ' అని జీఎంఆర్ వెల్లడించింది.

Similar Posts

Recent Posts

International

Share it