స్పైస్ జెట్..విమానంలో నుంచే క్యాబ్ బుకింగ్ సేవ‌లు

స్పైస్ జెట్..విమానంలో నుంచే క్యాబ్ బుకింగ్ సేవ‌లు

ప్ర‌ముఖ చౌక ధ‌ర‌ల విమాన‌యాన సంస్థ స్పైస్ జెట్ కొత్త స‌ర్వీసుల‌తో ముందుకు వ‌చ్చింది. చాలా మందికి విమానం దిగిన త‌ర్వాత ఆయా న‌గ‌రాల్లో ర‌వాణా సౌక‌ర్యాలు వెతుక్కోవ‌టం ఒకింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. ఉబెర్. ఓలా వంటి స‌ర్వీసులు అందుబాటులోకి వ‌చ్చినా అది కూడా విమానాశ్ర‌యంలో దిగిన త‌ర్వాత ఈ సేవ‌లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా స్పైస్ జెట్ విమానంలో ఉండ‌గానే క్యాబ్ బుక్ చేసుకునే స‌ర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. విమానంలోని స్పైస్ స్క్రీన్ లోనే క్యాబ్ బుక్ చేసుకోవ‌చ్చ‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వంద శాతం బుకింగ్ నిర్ధార‌ణ జ‌రుగుతుంద‌ని..ఒక వేళ స‌ర్వీసు ర‌ద్దు చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు ఉండ‌వ‌ని స్పైస్ జెట్ వెల్ల‌డించింది.

అదే స‌మ‌యంలో విమానం దిగిన త‌ర్వాత వేచిచూడాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. అయితే తొలుత ఈ స‌ర్వీసులు ఢిల్లీలో అందుబాటులోకి వ‌చ్చాయి. వ‌ర‌స‌గా ముంబ‌య్, బెంగ‌ళూరు, హైద‌రాబాద్, గోవా, చెన్న‌య్,కోల్ క‌తా, అహ్మ‌దాబాద్, పూణే వంటి న‌గ‌రాల్లోని ఈ సేవ‌లు ప్రారంభిస్తామ‌ని స్పైస్ జెట్ వెల్ల‌డించింది. స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ ద్వారా స్పైస్ స్క్రీన్ కు క‌నెక్ట్ అయి..క్యాబ్ బుక్ చేసుకోవ‌చ్చ‌ని, బుక్ చేసుకున్న వెంట‌నే మెసేజ్ లేదా వాట్స‌ప్ కు స‌మాచారం వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. క్యాబ్ జ‌ర్నీ పూర్త‌య్యాకే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. క్యాబ్ బుకింగ్ కు సంబంధించి త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్లు కూడా అందిస్తున్న‌ట్లు స్పైస్ జెట్ తెలిపింది.

Similar Posts

Recent Posts

International

Share it