థాయిలాండ్ టూర్ మరింత కాస్ట్లీ

థాయిలాండ్ టూర్ మరింత కాస్ట్లీ

పెరిగిన వీసాల ఖర్చుకు తోడు ఇప్పుడు మరో అదనపు భారం. కరోనా తర్వాత పర్యాటకం ప్రియం అవుతోంది. విమాన టికెట్ ధరలతో పాటు హోటల్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగాయి. కరోనా కు ముందు...ఇప్పటి పరిస్థితితో పోలిస్తే కాస్ట్ 25 నుంచి 30 శాతం మేర పెరిగింది. ఈ తరుణంలో థాయిలాండ్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే థాయిలాండ్ కొత్త విధానం అమలులోకి తేనుంది. అది ఏంటి అంటే ఈ జూన్ నుంచి ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా 734 రూపాయలుగా నిర్ణయించారు. థాయిలాండ్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్రతి విదేశీ ప్రయాణికుడు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా తర్వాత థాయిలాండ్ తమ దేశానికి పర్యాటకులను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది.

పర్యాటకుల నుంచి వసూల్ చేసే ఫీజు ను దేశంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి తో పాటు ప్రమాదాలకు గురైన వారిని ఆదుకోవటానికి ఉపయోగించాలి అని ఆ దేశం నిర్ణయించింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం వాటా 12 శాతం ఉంటుంది. ఈ ఏడాది థాయిలాండ్ కు 25 మిలియన్ల పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ ఫీజు ప్రతిపాదన గత ఏడాది తెరపైకి వచ్చినా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు కాబినెట్ ఆమోదం తీసుకుని జూన్ నుంచి అమలు చేయాలని ప్రతిపాదించారు. దీంతో థాయిలాండ్ వెళ్లే పర్యాటకులు వీసా ఫీజు తో పాటు ఇప్పుడు కొత్తగా పర్యాటక ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it