అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితం కాదు

అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితం కాదు

కరోనా దెబ్బకు దేశీయ, అంతర్జాతీయ విమానయాన రంగం కకావికలం అయింది. అంతే కాదు.. పర్యాటకం కూడా పూర్తిగా పడకేసింది. మధ్యలో కాస్త ఊరట ఇచ్చినట్లే కన్పించినా రెండవ దశ కరోనాతో మరోసారి విమానయానంపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క విమానయానమే కాదు..పర్యాటక రంగం కూడా తీవ్రంగా నష్టాలు పాలు అయింది. ఇప్పటికీ ప్రముఖ పర్యాటక దేశాల మధ్య ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవి ఎప్పుడు తొలగుతాయో అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. కొన్ని దేశాలు మాత్రం వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి మాత్రం తమ తమ దేశాల్లోకి అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ దిశగా సన్నాహాలు కూడా చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అంతర్జాతీయ ప్రయాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పోరులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని, కొత్త వేరియంట్ల కారణంగా ఈ దశలో అంతర్జాతీయ ప్రయాణాలు ఏ మాత్రం సరికాదని పేర్కొంది.

అయితే కొంతలో కొంత ఊరట కల్పించే అంశం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేయటం సానుకూల పరిణామంగా తెలిపింది. ఇంకా కరోనా వైరస్ ముప్పు తొలగిపోలేదన్నారు. ఈ దశలో ప్రయాణాలపై ఆలోచన చేయాలని..లేదంటే పూర్తిగా దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్ వో యూరప్ డైరక్టర్ హన్స్ కూగ్లే వెల్లడించారు. భారత్ లో ప్రస్తుతం ఉన్న కొత్త రకం కరోనా వైరస్ యూరప్ లోనే 26 దేశాలకు పాకిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య చాలా పరిమితంగా ఉన్నందున జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే.

Similar Posts

Recent Posts

International

Share it