రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా చరిత్రాత్మక, ఆథ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది.మంథనికి సమీపంలోని పెద్ద పర్వతశ్రేణిలో ఈ రామగిరి కోట ఉంటుంది.పూర్వకాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం ఇక్కడ నివసించి చాతుర్మాస తపం ఆచరించినట్లు పురాణకథనం. ఈ దుర్గం అంతర్భాగంలో సీతారాముల దేవస్థానం, రామస్థాపిత శివలింగం,జానకిదేవి పాద చిహ్నాలు ఉన్నాయి. సమస్త వనమూలికలకు నిలయంగా ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంది ఈ ప్రాంతం. ప్రతి ఏటా శ్రావణ మాసంలోని సోమ, శనివారాల్లో భక్తులతో ఖిల్లా కిటకిటలాడుతుంది. ఈ కోట ప్రాకారంలో బురుజులు కూడా ఉన్నాయి.దుర్గంలో లోపల పలు రాజభవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా అనేక హిందూ దేవాలయాలు..మసీదులు ఇక్కడ దర్శనం ఇస్తాయి.

ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు,ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా,ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటికీ పర్యాటకులను అలరిస్తూ విరాజిల్లుతోంది. ఈ ప్రాంతాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్‌, గుంజపడుగు గ్రామాల్లో పురావస్తు శాఖ తవ్వకాలలో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి.పౌరాణికంగాకూడా రామగిరి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటపైన సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్‌ విగ్రహాలతో పాటు నంది విగ్రహం కూడా ఉంది. శ్రీరాముని విగ్రహం ఉన్న చోట సుమారు 1000 మంది తలదాచుకునేంత విశాల ప్రదేశం ఉండడం విశేషం. రాజుల పాలనలో రామగిరిఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది.

Similar Posts

Recent Posts

International

Share it