రిషికొండ బీచ్

రిషికొండ బీచ్

కనుచూపు మేర ఇసుక తిన్నెలతో కూడిన తీరాలు... నీళ్లలో కేరింతలు కొడుతూ ఆడుకునే ప్రజలు, అలసిన మనసుకు తోడుగా, ఒంటరితనాన్ని దూరం చేసేలా... పెద్దలు కూడా పిల్లలై ఆడుకునేలా చేసేవి సముద్ర తీరాలే. రోజూ వివిధ పనులతో, ఒత్తిడితో వేడెక్కిన బుర్రలకు కాస్త రిలీఫ్‌గా ఉండాలంటే తరచూ ఇలాంటి విహార యాత్రలు చేయాల్సిందే. విశాఖపట్నానికి ఎనిమిది కి.మీ. దూరంలో ఉంది రిషికొండ బీచ్. దీనికి సొంత వాహనాలలో లేదా ఆర్టీసీ బస్సులలో వెళ్లవచ్చు. ఇక్కడ కూర్చుని ఆహ్లాదంగా గడిపే సమయాన్ని జీవితంలో మరచిపోలేరు. విరామం లేకుండా ఎగసిపడే అలలు మీకు కొత్త సందేశాన్ని ఇస్తుంటాయి. వాటి మధ్య మీ కుటుంబంతో కలిసి గడిపే క్షణాలు మాటల్లో చెప్పలేని మధుర జ్ఞాపకాలు. ఒడ్డున నిల్చుంటే కాళ్లను వెచ్చగా తాకే అలలు మిమ్మల్ని గిలిగింతలు పెడతాయి.

మీ చుట్టూ అమరినట్టుండే పచ్చని చెట్లు... ఆ దృశ్యం పెయింటింగా అని భ్రమించేలా ఉంటుంది. ఉదయం,సాయంకాల సమయాలలో సూర్య కిరణాలు పడి నీళ్లు తారల్లా మెరుస్తుంటే వాటి మధ్య మీరు చేరి ఆడుకోవచ్చు. సూర్యాస్తమయమైన తర్వాత వీచే గాలులు చలిరేపుతాయి. అయినప్పటికీ, ఈ ప్రదేశంలో వేడి ఉన్న కారణంగా మిమ్మల్ని మరి కొంతసేపు అక్కడ ఉండేలా చేస్తుంది. నిత్యం పనుల బిజీతో ప్రకృతిని ఆస్వాదించేందుకు అవకాశం లేదని బాధపడేవారు ఈ బీచ్‌కు వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరో ముఖ్యాంశం ఏమిటంటే ఈత కొట్టేందుకు, విండ్ సర్ఫింగ్, నీటిలో బోట్ షికారు చేసేందుకు ఈ బీచ్ చాలా బావుంటుంది. వేసవిలో పర్యటించాల్సిన ప్రాంతం ఇది.

Similar Posts

Recent Posts

International

Share it