శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దర్శించుకునే దేవాలయాల్లో శ్రీకాళహస్తి అతి ముఖ్యమైనది. అతి పురాతనమైన శివాలయాల్లో శ్రీకాళహస్తి ఒకటి. తిరుమల దర్శనంతో సంబంధం లేకుండా కూడా కొంతమంది భక్తులు విడిగా కూడా శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున కొలువై ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన పంచభూత లింగాల్లో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడి రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తుకళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల పనితనానికి తార్కాణంగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైంది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు. సువర్ణముఖీ నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు.

స్వయంభువు లింగం. లింగానికెదురుగా వున్న దీపం లింగం నుంచి వచ్చే గాలికి రెపరెపలాడుతుంది. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ 'అని కూడా అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబా త్రయములలో ఒకరు. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడని చెబుతారు.

Similar Posts

Share it