వేయి స్తంభాల గుడి

వేయి స్తంభాల గుడి

హన్మకొండలోని వేయిస్తంభాల గుడిని క్రీ.శ 1162లో కాకతీయులు నిర్మించారు. ఆలయ మంటపంపై ఎటుచూసినా నాట్యభంగిమలో ఉన్న స్త్రీమూర్తులు..పురాణ ఘట్టాలను శిల్పాలుగా మార్చిన తీరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కళ్యాణ మండపం, ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే దీనికి వేయి స్తంభాల గుడి అని పేరు వచ్చింది. రుద్రేశ్వరాలయంగా పిలిచే ఈ గుడిలో పెద్ద శివలింగం ఉంటుంది. శివ, వైష్ణవ, సూర్యదేవులు కలిగిన త్రికూట ఆలయంగా భక్తులు దీన్ని కొలుస్తారు. కాకతీయ రాజుల శిల్పకళా వైభవాన్ని చూపే ఈ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజుల్లో దీన్ని సహస్ర శివమాన మంటపంగా పిలిచేవారు. తర్వాత ఇది వేయి స్తంభాల దేవాలయంగా మారిపోయింది. ఎంతో శిల్పకళా నైపుణ్యంతో పాటు చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించటానికి పెద్ద ఎత్తున భక్తులు..పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైవున్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలిచారు.కళ్యాణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా, గాలికి రాలే పూలు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం హృద్యంగా ఉంటుంది.

ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువై ఉన్నాయి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కోసం ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారం ఇక్కడ ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా,రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారాన్ని ప్రస్తుతం మూసివేశారు. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

హైదరాబాద్ నుంచి 144 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సందర్శన వేళలు: ఉదయం 5.00 గంటల నుంచి

సాయంత్రం 9.00 గంటల వరకూ

https://www.youtube.com/watch?v=g5IWeN4BIX0

Similar Posts

Recent Posts

International

Share it