శ్రీహరి వాసం.... తిరుమల క్షేత్రం

శ్రీహరి వాసం.... తిరుమల క్షేత్రం

అదిగో..అల్లదిగో శ్రీహరి వాసమూ అంటూ ప్రతి ఏటా లక్షలాది భక్తులు గోవింద నామస్మరణతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి తరలి వస్తుంటారు. తిరుమల అంటేనే నిత్యకళ్యాణం..పచ్చతోరణం.ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న దేవాలయాల్లో తిరుమల ఒకటి. ఏపీకి వచ్చే పర్యాటకులు తిరుమల చూడకుండా వెళ్లడం కద్దు. విదేశాల నుంచీ ఏటా విశేష సంఖ్యలో భక్తులు దేవదేవుడి దర్శనానికి వస్తుంటారు. భక్తులు అత్యంత మహిమాన్విత క్షేత్రంగా భావించే తిరుమల చిత్తూరు జిల్లాలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని నిర్వహించే స్వతంత్ర సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఇది తిరుమల దేవాలయ వ్యవహారాలనేకాక దేశ వాప్తంగా సామాజిక, ధార్మిక, సాంస్కృతిక,సాహిత్య, విద్యా సంబంధ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. టీటీడీకి1933లో తొలిసారి పాలకమండలి ఏర్పాటైంది.

వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ టీటీడీ. 1830ల నాటికే తిరుమల వేంకటనాథుడికి భక్తులు కానుకలు, ఇతర రూపాలలో చెల్లించే సొమ్ముల నుంచి ఈస్టిండియా కంపెనీకి సంవత్సరానికి రూ.లక్ష వచ్చేది. స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్‌ను తితిదే ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. తితిదే పాలక మండలి ఏర్పాటైన తర్వాత ఏడున్నర దశాబ్దాల్లో తిరుమల సర్వతోముఖాభివృద్ధి చెందింది. కొండమీదకు బస్సుల ఏర్పాటు, ఘాట్‌రోడ్డు నిర్మాణంతో 1956 నాటికి భక్తుల సంఖ్య ఒక్కసారి భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ తిరుమల వేంకటేశ్వరస్వామిని సగటున 80 వేల మంది దర్శించుకుంటున్నారు.కాలి నడకన తిరుమలకు చేరుకునే వారు, ముందుగా తిరుపతిలోని అలిపిరి వద్దకు వచ్చి అక్కడి నుండి నడక ప్రారంభించాలి. అక్కడ వున్న శ్రీవారి పాద ఆలయాన్ని దర్శించి, పంచలోహాలతో చేసిన శ్రీవారి పాదాలను నెత్తిమీద పెట్టుకుని ప్రదక్షిణ చేసి తర్వాత నడక ప్రారంభిస్తే,అలసట అనేది కలగదని భక్తుల నమ్మకం. తర్వాత నడక ప్రారంభించి శ్రీవారి నామాలను స్మరిస్తూ వృషభాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి,నీలాద్రి, గరుడాద్రి, హేమాద్రి, వేంకటాద్రి పర్వతాలను దాటి ఆ వడ్డికాసుల వాని సన్నిధికి చేరుకుంటారు. ఈ ఏడు కొండలూ దాటడం అంటే మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలి,ఆఖరిదైన ఆ కలియుగ వైకుంఠాన్ని చేరుకొంటే మనిషి జన్మ ధన్యమైనట్లేనని ఎంతోమంది ప్రగాఢ విశ్వాసం. తిరుమల క్షేత్రాన్ని దర్శించడం వెనుక శాస్త్రీయమైన కారణాలు కూడా చాలా ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=ZC59XVQvPPY

Similar Posts

Recent Posts

International

Share it