ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలు ఒకటి. పేరుకు ఇది గుంటూరు జిల్లాలో ఉన్నా విజయవాడకు దగ్గరలో ఉంటాయి. ఈ గుహలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని ఓ కొండలో ఏకశిలపై ఇవి చెక్కి ఉంటాయి.అజంతా..ఎల్లోరా శిల్పాల తరహాలోనే ఉండవల్లి గుహల్లో కళానైపుణ్యం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన ఈ గుహలలో క్రీస్తు శకం 2, 3 శతాబ్దంలో బౌద్ధమత ప్రచారం జరుగుతున్న సమయంలో శిల్పాలను చెక్కినట్లు చరిత్ర చెబుతోంది. నాలుగు అంతస్థులుగా చెక్కిన ఈ గుహల్లో 64 స్తంభాలతో ఖానాలుగా మలిచారు.మొదటి అంతస్థులో 14 గుహలున్నాయి.

త్రిమూర్తుల విగ్రహాలు చెక్కి ఉంటాయి. రెండవ అంతస్థులో అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం శయనతరహాలో ఉంటుంది. ఈ విగ్రహం ఐదు అడుగుల వెడల్పు..19 అడుగుల పొడవు కలిగి ఉంటుంది.మూడవ అంతస్థులతో త్రికూటాలయం ఉంటుంది. వీటిపై ఉన్న శిల్పకళలు చాళుక్యుల కాలం నాటివిగా చరిత్ర చెబుతోంది. ఉండవల్లి నుంచి మంగళగిరి పానకాల లక్ష్మీనర్సింహస్వామి కొండ వరకూ తొమ్మిది కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ఉన్నట్లు చరిత్రలో ఉంది. అప్పట్లో మునులు, బౌద్ధ భిక్షువులు కృష్ణానదిలో స్నానం చేసి ఉండవల్లి గుహల్లో ఉన్న సొరంగ మార్గం నుంచి మంగళగిరిలో కొండపైన ఉన్న పానకాలస్వామిని దర్శించుకునేవారని చెబుతారు. ఈ గుహలపై ఉన్న స్థంభాలపై పూర్ణకుంభం చిత్రించి ఉంటుంది. తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా గుర్తించినట్లు ప్రచారం. 1959లో గుహాలయాలు పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళాయి.

Similar Posts

Recent Posts

International

Share it