దేవరకొండ ఫోర్ట్

Update: 2019-04-14 10:04 GMT

రాజులు పోయారు..రాజ్యాలు గతించాయి. కానీ.. అలనాటి కట్టడాలు నేటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. చరిత్రకు సజీవ సాక్ష్యాలైన ఎత్తైన కోటలు, బురుజులు, రాతి కట్టడాలు నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో కనిపిస్తాయి. హైదరాబాద్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో దేవరకొండ ఉంది. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి ప్రతి పదిహేను నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. నల్లగొండ జిల్లా కేంద్రంనుంచి

దేవరకొండకు 60కిలోమీటర్ల దూరం. దేవరకొండ శివారులో ఉండే ఖిల్లాకు చేరుకోవాలంటే ఖిల్లా బజార్ నుంచి దారి ఉంటుంది. ఖిల్లా ఆవరణలోనే ఎత్తైన బురుజులు, కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఖిల్లా ప్రాంగణంలోకి ప్రవేశించగానే విశాల మైదానం..ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి. ఖిల్లా ప్రాంగణం సమీపంలోనే కోట్ల బావి ఉంటుంది.

ఖిల్లా శివారుకు దగ్గరలో ఉన్నా అక్కడికి చేరుకోవాలంటే మెట్ల ద్వారా ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. ఖిల్లాపైకి చేరుకునే క్రమంలో పురాతన కట్టడాలు, పచ్చని చెట్లు, కోటలు, విశ్రాంతి గదులు, గృహలు ఆకట్టుకుంటాయి. ఖిల్లాపైకి చేరుకోగానే దేవరకొండ ఏరియల్‌వ్యూ మాదిరి పచ్చని పొలాలు, సుందరమైన దృశ్యాలు కట్టిపడేస్తాయి. ఖిల్లాపైనే శివాలయం, అక్కడే నీటి సరస్సు ఉంటుంది. గుర్రపు శాలలు, ఫిరంగి నాలా ఇప్పటికీ కనిపిస్తాయి. దేవరకొండలో ఖిల్లాతో పాటు దగ్గరలోనే ఉండే ఏకేబీఆర్ రిజర్వాయర్, డిండి ప్రాజెక్టులను కూడా సందర్శించవచ్చు.

 

Similar News

ఫణిగిరి