ధర్మపురి

Update: 2019-04-14 12:23 GMT

ధర్మపురిని సందర్శిస్తే యమపురి ఉండదు. ఇదీ ఈ దేవాలయం విశిష్టతగా చెబుతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలో ఉంది.గోదావరి నదీ తీరాన వెలసిన ఆలయ పట్టణం అయిన ధర్మపురి 10వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. పురాణాల ప్రకారం బలివర్మ ఒక ధర్మయజ్ఞం చేయగా అతని కోరిక మేరకు ప్రజలందరూ ఓ నిర్ణయానికి వచ్చి.. ధర్మపురి పేరు పెట్టారని చెబుతారు. పురాతన కాలంలో ఈ ప్రాంతం భాషా పరిజ్ఞానానికి, సాహిత్యం, నృత్యం, సంగీతానికి ఓ అభ్యాస కేంద్రంగా ఉండేది. 13వ శతాబ్దానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి గుడి,శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి, శివుడు, విష్ణువు ఇరువురు పక్క పక్క వెలసిన శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.

యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పర్చుకున్నట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజుని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నాలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి పేరు వచ్చిందని పురాణాల్లో చెప్పారు. ధర్మపురిలో ఒక ప్రత్యేకత ఉంది అది యమ ధర్మరాజు ఆలయం.

హైదరాబాద్ నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కి మీ దూరంలో ఉంది.

Similar News

నగునూరు