కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

Update: 2019-04-27 05:05 GMT

కోరింగ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. ఈ అడ వులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. ఇవి కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి.అటవీశాఖ లెక్కప్రకారం 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. చిత్తడి నేలలో పెరిగే చెట్ల వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలి పీల్చుకునే ఈ'చిత్తడి అడవులు ' కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి(బురద) నేలల్లోనే పెరుగుతాయి. అన్ని నదీ సాగర సంగమాలు చిత్తడి నేలలని ఏర్పరచవు. గంగాతీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని "సుందర వనాలు " మడ అడవుల తరువాతి స్థానం కోరింగ అభయారణ్యానిదే.అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయి.

మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా ఉన్నాయి. ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయి. పొన్న,మడ, కళింగ, గుగ్గిలం మొదలైనటువంటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి ఉంది ఈ ప్రాంతం. ఇక్కడ చేపలు పట్టే పిల్లి, నీటికుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు. వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెలల వరకు సముద్రపు తాబేళ్ళు,సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికి వస్తాయి. సంవత్సరంలో 12 నెలలూ ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు. అయితే దర్శించటానికి నవంబరు,డిసెంబరు నెలలు అత్యుత్తమమైనవి. జీవవైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూడడానికి, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ ఒకే చోట పొందడానికి ఎకో పర్యాటకానికి - మడ అడవుల సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. రంగురంగుల పడవలు, చిత్తడినేలలు, సముద్రపు గాలి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

కాకినాడ నుండి 14.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 

Similar News

పాపికొండలు
కడియపులంక